నిన్న రాహుల్ గాంధీ.. నేడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
By న్యూస్‌మీటర్ తెలుగు
హత్రాస్ దారుణంపై దేశం అట్టుడుకుతోంది. యూపీ, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా.. హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను గురువారం నాడు యూపీ పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగిన తోపులాటలో రాహుల్ కిందపడ్డ విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా అలానే ఈరోజు కూడా మరో ఎంపీని పోలీసులు కింద పడేశారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలను గ్రామానికి ఒక కిలో మీటరు దూరంలో పోలీసులు అడ్డుకున్నారు.
అందులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఉండగా.. వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కిందపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.
మరోపక్క బాధితురాలి కుటుంబం అనుమతిలేకుండా పోలీసులు రాత్రికి రాత్రికే బాధితురాలి మృతదేహాన్ని దహనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించి.. అక్టోబర్ 12న రాష్ట్ర, జిల్లా అధికారులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.