పోలీసులు నా బ‌ట్ట‌లు చింపేశారు : కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2020 9:38 AM GMT
పోలీసులు నా బ‌ట్ట‌లు చింపేశారు : కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు

ఢిల్లీ ప్ర‌దేశ్ మ‌హిళా కాంగ్రెస్(డీపీఎంసీ) అధ్య‌క్షురాలు అమృత ధావ‌న్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. హ‌త్రాస్‌కు వెళ్తున్న రాహుల్‌, ప్రియాంక గాంధీల‌ను య‌మునా ఎక్స్‌ప్రెస్ వేపై నిన్న యూపీ పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. వారితో పాటు అమృత కూడా ఉన్నారు. అయితే.. అక్క‌డ తోపులాట జ‌రిగిన‌ స‌మ‌యంలో త‌న బ‌ట్ట‌ల‌ను పోలీసులు చింపేశార‌ని అమృత పేర్కొన్నారు.



ఈ విష‌య‌మై ఆమె ట్విట‌ర్ వేదిక‌గా పోలీసుల తీరును ఎండ‌గ‌ట్టారు. అలాగే.. న‌రేంద్ర‌ మోదీ, యోగి ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆమె మండిప‌డ్డారు. మీ బ‌లాన్ని చూపించాల‌నుకుంటే.. నేర‌స్తుల‌పై చూపించండ‌ని పోలీసుల‌ను ఉద్దేశించి అమృత వ్యాఖ్యానించారు. మ‌హిళ‌ల బ‌ట్ట‌ల‌ను చింపేయ‌డం వ‌ల్లం ఏం సాధిస్తారు? అని ఆమె ప్ర‌శ్నించారు. ద్రౌప‌ది చీర లాగిన, సీత‌ను ఎత్తుకెళ్లిన వారి జీవితాలు ఎలా ముగిశాయో గుర్తుంచుకోండంటూ ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే.. అమృత ధావ‌న్ వ్యాఖ్య‌ల‌పై నోయిడా డీసీపీ వ్రిందా శుక్లా స్పందించారు. రాహుల్‌, ప్రియాంక‌ను అడ్డుకున్న స‌మ‌యంలో తానే అక్క‌డే ఉన్నాన‌ని తెలిపారు. మ‌హిళా పోలీసులు కూడా ఉన్నారు. ఏ మ‌హిళ గౌర‌వానికి కూడా భంగం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని డీసీపీ శుక్లా స్ప‌ష్టం చేశారు.

Next Story