యోగీ ఇలాఖాలో బీజేపీ నేత కాల్చివేత..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2020 1:24 PM ISTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున గ్యాంగ్స్టర్లను ఏరి పారేశారు. ఎంతో మంది రౌడీలు, గూండాలు స్వచ్ఛందంగా లొంగిపోయారు కూడానూ..! మేము కావాలంటే జైల్లో బ్రతుకుతాము.. ఏదో ఒక కేసు మీద మమ్మల్ని అరెస్టు చేసి లోపల వేయండి సార్ అంటూ అడిగారు. యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత యూపీలో క్రైమ్ రేట్ తగ్గిందని చెబుతున్నా.. పూర్తిగా అయితే అంతమవ్వలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేతనే కాల్చి చంపేశారు.
బాగ్‌పత్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం ఉదయం.. తన ఇంటికి దగ్గరలోని పొలాల్లో మార్కింగ్ వాక్ కు వెళుతూ ఉండగా అతడిపై కాల్పులు జరిపారు. భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ సంజయ్ ఖోఖర్. ఈ సంఘటన బాగ్‌పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సంజయ్ మీద పలు మార్లు కాల్పులు జరిగాయని.. రక్తపు మడుగులో నిండి ఉన్న అతడి శవం పొలాల మధ్యలో కనిపించిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు.
విచారణను వేగవంతం చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో గత నెలలో రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకుడు దేశ్‌పాల్ ఖోఖర్‌ను కూడా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
సంజయ్ శవం చెరుకు పంటకు దగ్గరలో కనిపించింది. అతడి షర్ట్ మొత్తం రక్తంలో తడిచిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు వ్యక్తులు సంజయ్ ను కాల్చి ఉంటారని చెబుతున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నామని.. త్వరలోనే అరెస్టులు చేస్తామని పోలీసులు చెబుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ ఘటనపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.