అయోధ్య భూమి పూజ ప్రసారంపై క్లారిటీ ఇచ్చిన‌ టీటీడీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 11:28 AM GMT
అయోధ్య భూమి పూజ ప్రసారంపై క్లారిటీ ఇచ్చిన‌ టీటీడీ

అయోధ్యలో రామమందిరం భూమి పూజను తిరుమల భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో ప్ర‌త్య‌క్ష‌ ప్రసారం చేయకపోవడంపై టీటీడీ స్పందించింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతున్న తిరుమలలో ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కటిన్నర గంట పాటు శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నామని.. రామమందిరం శంకుస్థాపన కార్యక్రమ సమయంలో ఎస్వీబీసీలో కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోందని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కల్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారని పేర్కొంది. కల్యాణోత్సవం కార్యక్రమం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చెయ్యడం లేదని తెలిపింది. నేడు గంట పాటు అయోధ్య రామమందిరం శంకుస్థాపనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది.

ఇదిలావుంటే.. అయోధ్య రామమందిర భూమి పూజను ఎస్వీబీసీ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చెయ్య‌కపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్వీబీసీ ఛానల్ బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రపంచంలో 250 టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారాన్ని గంటలపాటు ఇస్తే టిటిడి ఎందుకు చేయ‌లేద‌ని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై విచారణ చేపట్టి 24 గంటలలో బాద్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it