కరోనాపై ప్ర‌భుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

By Medi Samrat  Published on  28 July 2020 12:05 PM GMT
కరోనాపై ప్ర‌భుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచా‌ర‌ణ‌కు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ హాజరయ్యారు. టెస్టులు, ఆస్పత్రుల్లో చికిత్స సహా పలు వ్యాజ్యాలపై హైకోర్టు ఏక కాలంలో విచారణ జ‌రిగింది. హైదరాబాద్ నుండి మారుమూల ప్రాంతాల వ‌ర‌కూ కరోనా విస్తరించిందని.. అక్క‌డ కూడా ప్రజలు క‌రోనాతో చనిపోతున్నారని.. కరోనా నియంత్రణకు ప్ర‌భుత్వం తీసుకున్న చర్యలేంటని హైకోర్టు ప్రశ్నించింది.

ఇతర రాష్ట్రాల్లో క‌రోనా టెస్టులు ఎక్కువ మొత్తంలో చేస్తున్నా.. తెలంగాణలో ఎందుకు తక్కువగా చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది.. దీనికి బ‌దులుగా.. డబ్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మేరకు మూడున్నర లక్షలకు పైగానే టెస్టులు చేశామని సీఎస్ కోర్టుకు తెలియజేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆక్సీజన్ అందక 38 మంది చనిపోయారని.. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. నివారణ, నియంత్రణ ఎందుకు చేపట్లేదని ప్ర‌శ్నించింది. కరోనా బులిటెన్‌లో తప్పులేంట‌ని.. తమ ఆదేశాలనెందుకు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనాపై జారీ చేసే హెల్త్‌ బులిటిన్‌ను తప్పులు లేకుండా ప్రతి రోజు ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. కరోనా బాధితులు పెరుగుతున్న దృష్ట్యా 857 హోటల్స్‌ గదుల్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కోవిడ్ బారిన పడిన 248 మంది ప్రస్తుతం ఆ హోటల్ గదుల్లో ఉన్నారని తెలిపారు.

కోవిడ్ బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభతరం చేస్తామ‌ని.. గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పని సరి అమలు చేసి,. రిపోర్టు సమర్పిస్తామ‌ని సీఎస్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల రాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయని.. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశామ‌ని తెలిపారు.

ఎమ్‌ఆర్‌ఐ, సిటీ స్కాన్‌లపై ప్రైవేట్ ఆసుప‌త్రుల‌లో ఛార్జ్‌ల విషయంపై వారితో చర్చిస్తున్నామ‌ని తెలిపారు. వాటిపై ఇప్పటి వరకు 726 ఫిర్యాదు అందాయని.. వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ కోరుతున్నామ‌ని.. ప్రతి రోజు కరోనా పై పూర్తి సమాచారాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తప్పనిసరిగా అందిస్తామ‌ని కోర్టుకు తెలిపారు.

ప్రతి హాస్పిటల్స్ వద్ద డిస్‌ప్లే బోర్డుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని.. రాష్ట్రంలో ఎక్కువగా 21-50 ఏళ్ల వయస్సు గల వారే కరోనా బారిన పడుతున్నారని.. దీనిని నివారించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామ‌ని సీఎస్‌ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. రాపిడ్ కిట్ల వాడకం మరోసారి నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ఆగస్ట్ 13కు వాయిదా వేసింది.

Next Story