'దుబ్బాక ఉప పోరు'కు రాజకీయ పార్టీలు సన్నద్ధం..!
By సుభాష్ Published on 12 Sept 2020 1:20 PM ISTముఖ్యాంశాలు
ఉపపోరుకు రాజకీయ పార్టీలు సన్నద్ధం
ఎవరికి వారే ప్రయత్నాలు
వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న గులాబీ పార్టీ
నియోజకవర్గంలో జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ ప్లాన్
దుబ్బాక విజయంపై బీజేపీ ఆశలు
తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక పోరుకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. త్వరలో ఎన్నిక జరగనుందనే సంకేతాలు వస్తుండటంతో అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గంపై పడింది. టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మండలాల పార్టీ ఇన్‌చార్జీలుగా నిచమించారు. వీరు మండల స్థాయి ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి దుబ్బాక ఎమ్మెల్యీ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన స్థానాన్ని ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించి భర్తీ చేయాల్సి ఉంటుంది. వచ్చే నెలలో బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఉప ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక కూడా వాటితోనే నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అక్టోబర్‌లో దుబ్బాక ఉప ఎన్నిక జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ అసెంబ్లీ స్థానం టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం కావడం, ఇక్కడి నుంచి నాలుగు సార్లు దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ పక్కా ప్లాన్‌తో వెళ్తోంది.
జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇటీవల మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, దుబ్బాక మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేయడంతో పాటు దుబ్బాక చెరువులో చే పిల్లలను వదిలారు. అలాగే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పక్లా ప్లాన్‌తో ..
దుబ్బాక ఉప పోరుకు టీఆర్‌ఎస్ పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. సీఎం కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీష్‌రావు కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌చార్జీలుగా నియమించారు.
దుబ్బాక పోరులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
ఇక 2018 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రఘునందన్‌రావు మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయామండలాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇదే పార్టీ నుంచి తాజాగా మరో నాయకుడు కమలాకర్‌రెడ్డి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. టికెట్ తనకే వస్తుందంటూ ఆయా మండలాల్లో ముఖ్యనాయకులను కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పలువురు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎగురవేసేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
బలమైన నేతను రంగంలోకి దింపి దుబ్బాక నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తప్పిన ఫైర్ బ్రాండ్, తెలంగాణ రాములమ్మ విజయశాంతిని బరిలో దింపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతకు ఉమ్మడి మెదక్ జిల్లాపై ఉన్న పట్టే పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి రఘునందన్‌రావు పేరు వినిపిస్తుండగా, విజయశాంతి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ చేసేందుకు విజయశాంతిని కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. కానీ టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం టికెట్ కేటాయింపు అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే మాజీ మంత్రి ముత్యం రెడ్డి కాంగ్రెస్ వీడిన నాటి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేదు. 2009లో ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆయన తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న మరో నాయకుడు గుర్తింపు పొందలేదు. అలాగే నియోజకవర్గంలో విజయశాంతికి చాలా పరిచయాలున్నాయి. పార్టీలకతీంగా అన్ని పార్టీలతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నికల పోరులో రాములమ్మ కన్న బలమైన నేత ఎవరు లేరని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అంచనాలు ఇలా ఉంటే.. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇక తెలంగాణలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. మెదక్ ఎంపీగా ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టు ఉండటమే కాకుండా నియోకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఆమెకే టికెట్ ఇస్తే మేలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.