అమెరికాలో గాంధీ విగ్రహా ఘటనపై స్పందించిన ట్రంప్
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 10:23 AM GMTఅమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత.. జాత్యహంకార వ్యతిరేక నిరసనలతో అమెరికా అట్టుడికింది. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశారు. దీన్ని అవమానకరమైన చర్యగా పేర్కొన్నారు. సోమవారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జూన్ 2న అర్థరాత్రి వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి కొందరు నిరసనకారులు రంగు పులిమారు. విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగుల దుశ్చర్య విషయంలో భారత్‌ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహా పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చింది.
అమెరికా చట్ట సభల సభ్యులు కూడా గాంధీ విగ్రహంపై దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి ఘటనలు విచారకరం అంటూ ట్రంప్ సలహాదారు కింబర్లీ గిల్ ఫోయిల్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో ట్రంప్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన తన భార్య మెలనియాతో కలిసి సబర్మతీలోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించారు.