అత్యధిక విరాళాలతో ట్రంప్.. తాజా పరిణామంతో మరింత ధీమా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2020 11:45 AM ISTమనకు అలవాటైన ఎన్నికల తీరుకు.. అమెరికాకు పొంతన ఉండదు. రాజకీయ పార్టీలకు విరాళాల లెక్క పెద్దగా బయటకు రాదు. అందునా.. ఎన్నికలు జరిగే వేళలో.. ఏ పార్టీకి ఎంత మొత్తంలో విరాళాలు అందాయన్న విషయాన్ని మన దగ్గర రాజకీయ పార్టీలు అస్సలు వెల్లడించవు. వార్షిక లెక్కల సమయంలోనో.. ఎన్నికల సంఘం విడుదల చేసే గణాంకాల ఆధారంగానే బయటకు వస్తుంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి.
ఓ వైపు జోరుగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడే.. నెల వారీగా.. అధికార.. విపక్ష అభ్యర్థులకు వచ్చే విరాళాల లెక్క బయటకు వస్తుంటుంది. సదరు పార్టీకి వచ్చే విరాళాల ఆధారంగా కూడా ప్రజాభిమానం ఎటువైపు ఉందనే లెక్కల్ని కొందరు వేస్తుంటారు. ఇందులో నిజం ఎంత? అన్న మాటను పక్కన పెడితే.. విరాళాలు గుమ్మరిస్తున్నారంటే.. అందులో ఏదో లెక్క ఉందని.. కార్పొరేట్ కంపెనీలు ఉత్త పుణ్యానికే విరాళాలు ఇవ్వవు కదా? అన్న వాదనను వినిపిస్తుంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికా ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు ఆసక్తికరంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ భారీగా సాగుతున్న వేళలో.. రికార్డు స్థాయిలో జులై ఒక్క నెలలోనే పెద్ద ఎత్తున విరాళాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. జులై నెలలోనే డొనాల్డ్ టీంకు 16.5 కోట్ల డాలర్లు విరాళాలుగా వచ్చినట్లుగా చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకు అధికార పక్షానికి 1.1 బిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయని.. అందులో 30 కోట్ల డాలర్ల వరకు నగదు రూపంలో ఉండటం గమనార్హం. ట్రంప్ ప్రచారం కోసం ఆర్ఎన్ సీ 300 మంది క్షేత్రస్థాయి కార్యకర్తల్ని తాజాగా రిక్రూట్చేసింది. దీంతో.. ట్రంప్ గెలుపు కోసం పని చేస్తున్న వారి సంఖ్య 1500లకు పెరిగింది. ఓపక్క ప్రజాభిప్రాయ సేకరణలో ట్రంప్ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్న వేళ.. పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలు.. అధికారపక్షాలనికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మరి.. వచ్చే విరాళాలకు.. పడే ఓట్ల లెక్క ఏమిటన్నది రానున్న రోజుల్లో వెల్లడయ్యే ఫలితాలు సమాధానం చెప్పనున్నయాని చెప్పాలి.