గుజరాత్‌లో ట్రంప్‌ ఉండేది 3 గంటలు, ఖర్చు మాత్రం రూ. 85 కోట్లు

By సుభాష్  Published on  23 Feb 2020 1:53 PM GMT
గుజరాత్‌లో ట్రంప్‌ ఉండేది 3 గంటలు, ఖర్చు మాత్రం రూ. 85 కోట్లు

ముఖ్యాంశాలు

► ట్రంప్‌ కోసం భారీ ఏర్పాట్లు

► అడుగడుగునా భద్రత సిబ్బంది

► ట్రంప్‌ రాకతో మెరిసిపోతున్న రహదారులు

► మోదీతో ట్రంప్‌ కీలక భేటీ

► పలు కీలక అంశాలపై చర్చ

► పలు ఒప్పందాలపై ఇరువురు సంతకాలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మొదటిసారిగా భారత్‌కు వస్తున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు అంతా ఇంతా కాదు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు కేంద్ర సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ ప్రయాణించే రహదారులన్నీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేయిస్తోంది సర్కార్. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియంలోకి ట్రంప్‌ అడుగు పెట్టనున్నారు. దీంతో 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమానికి రూ. 85 కోట్లు ఖర్చు చేస్తోందని సమాచారం. రోడ్లన్నీ మెరిసేలా ఆధునీకరణకు రూ. 30 కోట్ల ఖర్చు చేస్తున్నారట. సోమవారం సాయంత్రం ట్రంప్‌ ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ వద్దకు వెళ్లనున్నారు. దీంతో అక్కడి ప్రాంతంలోని రోడ్లన్నీ తళ తళ మెరిసేలా చేస్తున్నారు. చూద్దామన్న ఇంత చెత్తాచెదారం కనిపించకుండా భారీ ఎత్తున మరమ్మతులు చేపడుతున్నారు. ఇక ట్రంప్‌ ప్రయాణించే మార్గంలో రహదారుల వెంట ఆకర్షనీయమైన రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రంప్‌ పర్యటన పుణ్యమా అని ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని మార్గాలన్ని ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్నాయి. కాగా, ట్రంప్‌ అహ్మదాబాద్‌లో గడిపే సమయం కేవలం మూడు గంటలు మాత్రమే అయినప్పటికీ ఈ ఏర్పాట్ల కోసం గుజరాజత్‌ సర్కార్‌ దాదాపు రూ.85 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.

ట్రంప్ కోసం ఏడు అంచెల భద్రత

అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియంలో హాజరు కానున్న ట్రంప్‌కు భారీ భద్రతను కల్పిస్తుందో గుజరాత్‌ సర్కార్‌. నగరంలో ట్రంప్‌ ఉన్నంత వరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్‌ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంటారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు 22 కిలోమీటర్ల వరకు అధునీకరించేందుకు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ షెడ్యూల్‌

ఫిబ్రవరి 24వ తేదీ

అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుని ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు.

అనంతరం సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌ నివాళులు అర్పిస్తారు. అనంతరం గాంధీ చరిత్రకు సంబంధించి పుస్తకాలను మోదీ ట్రంప్‌కు బహుకరిస్తారు.

తర్వాత మొటెరా స్టేడియానికి బయలుదేరుతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో 1.25 లక్షల మంది హాజరవుతారని అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

అనంతరం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో భోజనం చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్‌ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నేతలు కూడా హాజరు కానున్నారు.

సాయంత్రానికి ట్రంప్‌, మెలానియా ట్రంప్‌ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ వద్దకు చేరుకుంటారు. అధికారులు ఇప్పటికే 900 క్యుసెక్కుల నీటిని యమునా నదిలోకి వదిలారు. ట్రంప్‌ దంపతులు రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్‌లో బస చేస్తారు.

ఫిబ్రవరి 25వ తేదీ

ప్రధాని మోదీ, ట్రంప్‌ రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధిని సందర్శించి గాంధీకి నివాళులు అర్పిస్తారు. అలాగే ట్రంప్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో భేటీ అవుతారు. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ, ట్రంప్‌ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. మోదీ, ట్రంప్‌ భేటీ సమయంలో ట్రంప్‌ భార్య మెలానియా ఢిల్లీలోని పాఠశాలలను సందర్శిస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈవో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్‌ కలుస్తారు. రాత్రి పది గంటలకు ట్రంప్‌ దంపతులు తిరిగి అమెరికాకు బయలుదేరుతారు.

Next Story