జూపల్లిపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌.. కలవరపడుతున్న టీఆర్‌ఎస్‌

By అంజి  Published on  27 Jan 2020 11:18 AM IST
జూపల్లిపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌.. కలవరపడుతున్న టీఆర్‌ఎస్‌

మహబూబ్‌నగర్‌: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం గుర్రుగా ఉంది. జూపల్లి తన సొంత జిల్లాలోని కొల్లాపూర్‌, అయిజ మున్సిపాలిటీల్లో తన వర్గం వారికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్లు కేటాయించలేదు. అయిన జూపల్లి తన వర్గం వారిని రెబల్ అభ్యర్థులుగా పోటీలోకి దింపారు. దీంతో జూపల్లిపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు జూపల్లి ప్రయత్నించారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోగా, మంత్రిగా పని చేసి పార్టీకి నష్టం చేశావంటూ జూపల్లిపై సీఎం కేసీఆర్‌ అగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయనకు అక్కడ కూడా అనుమతి లభించలేదు. జూపల్లి వర్గం తరపును గెలిచిన కౌన్సిలర్లు కాకుండా, ఎక్స్‌ అఫిషియో సభ్యుల ద్వారా ఆస్థానాన్ని గెలవాలని ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి, పార్టీ ఇంచార్జి చాడా కిషన్‌రెడ్డిలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కొల్లపూర్‌లో మొదటగా కాంగ్రెస్‌ తరఫున జూపల్లిపై హర్షవర్థన్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆతర్వాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాగా తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను అధిష్టానం ఆ పార్టీ ఎమ్మెల్యేలకే వదిలేసింది. దీంతో హర్షవర్థన్‌రెడ్డి తనకు అనుగుణంగా అభ్యర్థులను బరిలో దింపారు. జూపల్లి వర్గానికి హర్షవర్థన్‌రెడ్డి చోటు కల్పించలేదు. వేరే వాళ్లకు టికెట్లు ఇవ్వడంపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొల్లపూర్‌, అయిజతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జూపల్లి అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ ద్వారా అభ్యర్థులను పోటీలో దింపి పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై ఘనవిజయం సాధించారు. కొల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 16 మంది టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ గెలిచారు. కింగ్‌మేకర్‌గా మారిన జూపల్లి.. అక్కడ తనకున్న బలమెంటో టీఆర్‌ఎస్‌కు చూపించారు. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. అయితే గెలిచిన అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతారని జూపల్లి తెలిపారు. ఇందుకోసం కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నంచారు. కాగా కొల్లాపూర్‌లో జూపల్లి మద్దుతు తీసుకోరాదని పార్టీ నిర్ణయించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల ద్వారా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ వ్యూహం పన్నింది.

Next Story