మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి రేషనలైజేషన్ అమలు చేయనుంది.

By Knakam Karthik  Published on  11 Jan 2025 8:21 AM IST
AP GOVERNMENT, CM CHANDRABABU, KEY DECISION, VILLAGE SECRETARISTS, TDP,YSRCP, BJP

మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి రేషనలైజేషన్ అమలు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మరిన్ని సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ఉన్నట్లు గుర్తించింది. వీరిని రేషనలైజేషన్ ద్వారా సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధానంలో కనీసం 2500 మంది జనాభాకి ఒక సచివాలయం ఉండేలా చూస్తోంది. దీనిలో ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్,నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500 నుంచి 3500 మంది జనాభాకు ఏడుగురు, 3501 మంది ఆపై జనాభాకు 8 మంది ఉండేలా సచివాలయ ఉద్యోగులను విభజిస్తారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని రూపొందించారు. రేషనలైజేషన్‌లో భాగంగా మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్‌గా వీరిని విభజించాలనేది ప్రతిపాదన. మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు. అలాగే వార్డు సచివాయలంలో వార్డు అడ్మినిస్టేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.

ఇందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విలేజ్ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీ పరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. వీరి ద్వారా ఏఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. కనీసం 2500 జనాభాకు లేదా 5 కిలో మీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండాలని సీఎం సూచించారు. ఏజెన్సీలలో అవసరమైతే అదనంగా సచివాలయాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. గతంలో ప్రతిపాదించిన విధానం మేరకే మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలని సూచించారు. ప్రస్తుతం కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలుపొందే అవకాశం ఉంది. ఉన్న వారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గృహాలన్నిటికీ జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించవద్దని ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

Next Story