తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By - Knakam Karthik |
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ గా వ్యవహరిస్తుంది. కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి.. జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్), చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు.
వీరితోపాటుగా.. కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) చీఫ్ ఇంజనీర్, CWC చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉంటారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటుచేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తోంది.
ఉదాహరణకు.. కృష్ణానది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023నాడు KWDT-2ను (Krishna Water Dispute Tribunal) ఏర్పాటుచేసి.. అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను నిర్దేశించింది. రెండేళ్ల కాల వ్యవధి 1 ఆగస్టు, 2025 నాడు ముగియగా.. కృష్ణాజలాల వినియోగంపై వాదనలు నడుస్తున్నందున.. దీన్ని మరో ఏడాది (31 జూలై, 2026) పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9, సెక్షన్ 84 ప్రకారం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం APEX కౌన్సిల్ ఏర్పాటైంది. 16, జూలై 2025 నాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ (జల్‌శక్తి) మంత్రి సీఆర్ పాటిల్ గారి నేతృత్వంలో జరిగిన APEX కౌన్సిల్ సమావేశంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా.. వాటిని చర్చించి, సాంకేతికతంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని APEX కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించింది. డిసెంబర్ 23, 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో ఇవాళ (శుక్రవారం) కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది.