అసలు పార్ట్‌నర్‌ను ఓడించేందుకే ఢిల్లీకి వచ్చా.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రెండు గ్యారంటీ కార్డులను ఆవిష్కరించారు.

By Knakam Karthik  Published on  16 Jan 2025 2:47 PM IST
NATIONAL NEWS, DELHI ASSEMBLY ELECTIONS, KEJRIVAL, MODI, CM REVANTH, BJP, CONGRESS, AAP

లిక్కర్ స్కామ్‌లో అసలు పార్ట్‌నర్‌ను ఓడించేందుకే ఢిల్లీకి వచ్చా.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రెండు గ్యారంటీ కార్డులను ఆవిష్కరించారు. ఈ గ్యారంటీల్లో రూ.500 లకు గ్యాస్ సిలిండర్, సామాగ్రి కిట్ ఉన్నాయి. ఈ కిట్‌లో 5 కిలోల బియ్యం, 2 కిలోల పంచదార, 1 లీటర్ ఎడిబుల్ ఆయిల్, 6 కేజీల పప్పులు, 250 గ్రాముల టీ పొడి ఉన్నాయి. రెండో గ్యారంటీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఉంది.

తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేశామన్న ఆయన, ఏడాది కాలంలోనే 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.22,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఢిల్లీలోని పేద ప్రజల స్థితిగతులు మారుతాయని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో తాము ఏడాదిలోనే 53 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. మహిళల కోసం ఉచిత బస్సు పథకం కల్పించామని చెప్పారు. ఎన్నికల కోసం తాము రాజకీయాలు చేయమని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. తెలంగాణ ఇస్తామని చెప్పిన సోనియాగాంధీ ఆ హామీని నెరవేర్చారని, ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో కోరారు సీఎం రేవంత్.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై తెలంగాణ సీఎం రేవంత్ విమర్శలు చేశారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా మోడీ, మూడుసార్లు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చేసిన పనులను.. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్‌తో పోల్చి చూసుకోవాలని ఢిల్లీ ప్రజలను కోరారు. మోడీ, కేజ్రీవాల్ పేర్లు వేర్వేరు అయినప్పటికీ చేతలు మాత్రం ఒక్కటే అంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరూ ఢిల్లీకి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు సీఎం రేవంత్. పదకొండేళ్లు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో భాగస్వామిని తెలంగాణలో ఓడించామని చెప్పిన రేవంత్, ఈ స్కామ్‌లో అసలు పార్ట్‌నర్‌ను ఓడించేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాము కేసీఆర్ అవినీతి పరిపాలనను నిర్మూలించి వాగ్ధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

Next Story