పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. దావోస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. మంత్రి లోకేష్ ను సీఎం సత్కరించారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి మంత్రి లోకేష్ వివరించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలపై చర్చ సాగింది.
తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం తెలియజేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, స్కిల్ క్యాంపస్ లుగా తీర్చిదిద్దిన ఐటీఐలను సందర్శించాలని సీఎం కోరారు.
కోట్లాది మంది దర్శించుకునే ములుగు జిల్లాలో వనదేవతల సన్నిధి మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం ఆధునీకరణ పనులు వందల కోట్లతో చేపట్టామని వివరించారు. దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం చూపని చొరవ ఇదని, రహదారులు, మౌలిక సదుపాయాలన్నీ కల్పించామని, వనదేవతలను దర్శించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ ని ఆహ్వానించారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని సీఎం చెప్పారు. పెట్టుబడుల సాధనలో పోటీపడి దేశానికే తెలుగురాష్ట్రాలు ఆదర్శంగా నిలవనున్నాయని సీఎం, మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.