ఢిల్లీలో కేటీఆర్ బిజీ షెడ్యూల్ - కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరీతో భేటి
Telangana Min KTR Meets Union Min Hardeep Singh Puri In Delhi
By - Nellutla Kavitha | Published on 23 Jun 2022 8:24 PM ISTఢిల్లీలో కేంద్ర మంత్రులతో మీటింగ్ లతో బిజీ గా గడుపుతున్నారు తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో ఈరోజు సమావేశమైయ్యారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా హైదరాబాద్ కి సంబంధించిన పలు ప్రాజెక్టులపై వినతులు సమర్పించారు.
హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ ప్రకారం 62 ఎస్‌టీపీ ప్లాంట్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఎస్‌టీపీల నిర్మాణాలకు రూ. 8,654 కోట్లు ఖర్చు అవుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు అమృత్-2 కింద కేంద్ర ప్రభుత్వం రూ. 2,850 కోట్లు ఇవ్వాలని వినతి చేశారు.
పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ మహానగరంగా ఎదుగుతున్నదని గుర్తు చేశారు. ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి, 69 కి.మీ మెట్రో రైలు నెట్‌వర్క్, 46 కి.మీ సబ్-అర్బన్ సేవలు / మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎమ్‌ఎమ్‌టీఎస్) హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అసెంబ్లీ నుంచి పారడైజ్ స్టేషన్ వరకు 10 కిలోమీటర్ల మేర వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు.