ముఖ్యాంశాలు

  • వారం రోజుల్లో ఫాస్టాగ్ పొందాలి
  • ఫాస్టాగ్ లేని వారికి డ‌బుల్ చార్జీలు
  • స్ప‌ష్టం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

వాహ‌న‌దారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాకిచ్చింది. టోల్‌గేట్ల వ‌ద్ద‌ మరో వారం రోజుల్లో ఫాస్టాగ్ అమలులోకి రానున్న నేప‌థ్యంలో వాహ‌న‌దారుల‌కు హెచ్చ‌రించింది కేంద్రం. ఫాస్టాగ్ ను రవాణా, రవాణాయేతర వాహనదారులందరూ తప్పనిసరిగా వాహనాలకు అమర్చాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఎవరైనా రిజిస్ట్రేషన్ లేకుండా ఫాస్టాగ్ లైన్లలోకి ప్రవేశిస్తే మాత్రం డబుల్ టోల్ చార్జీ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. ఫాస్టాగ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత డివైజ్. ఒకసారి ఫాస్టాగ్ ను కొనుగోలు చేసిన తరువాత ఐదు సంవత్సరాల వరకు ఆ ఫాస్టాగ్ కు వాలిడిటీ ఉంటుంద‌ని, ఈ నెల చివరి వరకు ఫాస్టాగ్ ను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల‌ని అధికారులు తెలిపారు.

ఫాస్టాగ్ పై కేంద్రం చ‌ట్టం:
కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ను ఉపయోగించాలని చట్టం చేసింది. ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రధానంగా ఫాస్టాగ్ ను అమలు చేస్తుంది. బ్యాంకులు ఫాస్టాగ్ ఇష్యూయర్ ఏజెన్సీలుగా ఉంటాయి. 240కు పైగా టోల్ ప్లాజాల్లో ప్రస్తుతం ఫాస్టాగ్ ను అమ‌లు చేశారు. ఫాస్టాగ్ కొనుగోలు చేయాలంటే వాహన ఆర్‌సీ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఐడీ ప్రూఫ్ త‌ప్ప‌ని స‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ కోసం టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ లైన్లు అందుబాటులో ఉంటాయి.

టోల్ ప్లాజాల పై భాగంలో వాహనదారులు తెలుసుకునే విధంగా ఫాస్టాగ్ లోగోలు ఏర్పాటు చేసి ఉంటాయి. ఫాస్టాగ్ లేకుండా ఎవరైనా పొరపాటున ఫాస్టాగ్ లైన్లలోకి వస్తే రెండు రెట్ల టోల్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ ఫాస్టాగ్ ల కోసం బ్యాంకులను సంప్ర‌దించ‌వ‌చ్చు. లేదా టోల్ ప్లాజా దగ్గర మంత్లీ పాసులు, లోకల్ పాసులు తీసుకోవచ్చు. కాగా, ఈ స‌దుపాయం ఉప‌యోగించుకోవాలంటే దాదాపు 100 రూపాయలతో ఫాస్టాగ్ టాపప్ రీచార్జీ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇక్క‌డ మ‌రో విష‌య‌మేమిటంటే ఒకే వ్య‌క్తికి రెండు వాహనాలు ఉన్న‌ట్ల‌యితే వారు వేరు వేరు ఫాస్టాగ్ లను కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని అధికారులు సూచిస్తున్నారు. ఒక వేళ ఫాస్టాగ్ పోయిన‌ట్ల‌యితే త‌క్ష‌ణ‌మే క‌స్ట‌మ‌ర్ కేర్ కు ఫోన్ చేసి వెంటనే బ్లాక్ చేయించుకోవాల‌ని అధికారులు చెబుతున్నారు. వీటితో అన్ని నేషనల్ హైవేల మీద ప్రయాణించవ‌చ్చు. ఒక వేళ‌ ఫాస్టాగ్ ఏ కార‌ణంగానైనా ప‌గిలినా… ప‌ని చేయ‌క‌పోయినా ఇష్యూయర్ ఏజెన్సీకి సమాచారం అందించి, దాని స్థానంలో మ‌రో కొత్త‌ది పొందాల‌ని వాహ‌న‌దారుల‌కు సూచిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.