నేడు కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. మరిన్ని సడలింపులు ఉంటాయా?
By సుభాష్ Published on 27 May 2020 7:08 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోగా, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవాం ఒక్క రోజు తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో పెరుగుతున్న కేసులు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. కాగా, లాక్‌డౌన్ సమయంలో కర్ఫ్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కూడా చర్చించనున్నారు.
గత 14 రోజులుగా ఇతర జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోగా, ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో తీవ్రంగా విజృంభిస్తోంది. తాజాగా కొన్ని జిల్లాల్లో కూడా కరోనా మహమ్మారి బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ ముగియనుండటంతో ఇలాంటి సమయంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై కేసీఆర్ చర్చించనున్నారు. మే 31 తర్వాత లాక్‌డౌన్ పొడిగించాలా..? వద్దా .? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు ఈ సమావేశంలో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, నెల 18వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్ నుంచి భారీగానే సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో తప్ప మిగతా జిల్లాల్లోని సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జీహెచ్‌ఎంసీలో సరి-బేసి విధానంలో షాపులు తెరుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం భౌతిక దూరం పాటిస్తూ, ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయతే జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజారవాణా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మెట్రో సర్వీసులు, కొన్ని బస్సులు నడిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక నగరంలో సరి-బేసి విధానం ఎత్తివేసినా.. సమావేశాలు, ఉత్సవాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, ప్రార్థన మందిరాలపై ఆంక్షలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షల విషయమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కర్ఫ్యూ మరి కొంత కాలం కొనసాగేంచే ఉద్దేశం ఉన్నట్లు సమాచారం.