అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

Vaikunta Dwara darshan at Tirumala temple from January 2-11. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి

By Medi Samrat  Published on  27 Dec 2022 1:46 PM GMT
అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, అదనపు ఈవో వీరబ్రహ్మం, జేఈవో సదా భార్గవి, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఇతర అధికారులతో మంగళవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో దాదాపు 92 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు :

జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజులకు గాను జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తాం. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా 4 లక్షల 50 వేల టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు త్వరిత గతిన దర్శనం చేయడం కోసం చేసిన ఈ ఏర్పాట్లను గమనించి భక్తులు టోకెన్ తీసుకున్నాకే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్‌, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల(మహాత్మాగాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌), ఎమ్‌.ఆర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ వెనుక వైపున గల శేషాద్రి నగర్‌లోని జెడ్‌పి హైస్కూల్‌, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు జారీ చేస్తామ‌ని తెలిపారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సహకారంతో ఏర్పాట్లు చేస్తాం.

- ఈ టోకెన్‌ కేంద్రాల వద్ద భక్తుల కొరకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, టి, కాఫీ అందిస్తాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం.

- తిరుమల స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.

- ఉచిత టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలి.

- తిరుపతిలో 9 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సర్వదర్శనం కౌంటర్లకు సులువుగా వెళ్లేందుకు వీలుగా ఆయా కౌంటర్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశాం. భక్తులు సెల్‌ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లను గుర్తించవచ్చు.

- భక్తులకు సమాచారం ఇచ్చేందుకు గాను చెర్లోపల్లి జంక్షన్‌, తిరుచానూరు వద్ద పూడి రోడ్డు, నవజీవన్‌ ఆసుపత్రి వెనుక హైవే వద్ద తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాల్లో కూడా సమీపంలోని సర్వదర్శనం కౌంటర్ల క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మాస్క్ ధరించి రావాలి

కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గ దర్శకాలు జారీ చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు.


Next Story