రూ.3,096 కోట్లతో టీటీడీ బడ్జెట్‌కు ఆమోదం
TTD comes out with Rs 3,096 crore budget for next fiscal. తిరుమల తిరుపతి దేవస్థానం 2022 - 23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు
By Medi Samrat Published on 17 Feb 2022 6:21 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానం 2022 - 23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ - 19 నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో కోవిడ్‌కు ముందులాగా శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించడంతో పాటు, సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం టిటిడి పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ ఆ వివరాలు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆసుపత్రి భవన నిర్మాణాలు రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భూమిపూజ చేయించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీ పద్మావతి హృదయాలయంకు అవసరమైన వైద్య పరికరాల కోనుగోలుకు టిటిడి జెఈవో ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుచేశారు. శ్రీ పద్మావతి హృదయాలయం ప్రారంభించి 100 రోజులలో 100 అపరేషన్లు నిర్వహించామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం కోసం ఏడాదిలో దశల వారీగా టిటిడి వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రూ.2.73 కోట్లతో స్విమ్స్‌కు కంప్యూటర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణకు ఆమోదం తెలిపారు. టిటిడి ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించడానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయంను బాలాజి జిల్లా కలెక్టరెట్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి నిబంధనల మేరకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో స్టీమ్ ద్వారా అన్నప్రసాదాల తయారు చేస్తున్న విషయం తెలిసిందే. టిటిడి గ్యాస్, డిజిల్ ద్వారా కేజి స్టీమ్ తయారీకి 4 రూపాయల 71 పైసలు ఖర్చు చేస్తోంది. NEDCAP వారు సోలార్ సిస్టమ్ RESCO మోడల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయల 54 పైసలతో 25 సంవత్సరాల పాటు సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందని.. తద్వారా టిటిడికి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుందని తెలిపారు.
తిరుమలలో రాబోవు రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అత్యున్నత స్థాయి నుండి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్‌లు మంజూరు చేయాలని తీర్మానించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయనున్నారు.
తిరుమల నాదనీరాజన మండపం షెడ్డు స్థానంలో శాశ్వత మండపం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య మార్గం త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవడానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయాలని తీర్మానించారు. అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అబివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానం చేసినట్లు తెలిపారు.
రూ.3.60 కోట్లతో టిటిడి ఆయుర్వేద ఫార్మశీకి పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాలని తీర్మానించారు. శ్రీవారి ఆలయ మహద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయించారు. గోపురాల బంగారు తాపడం విషయంపై ఆగమ పండితులతో చర్చించి క్రేన్ సహయంతో తాపడం పనులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం నెలాఖరులోపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి సభ్యులు మిలింద్ నర్వేకర్‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఇప్పటికే కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుని సమాచార కేంద్రం నిర్మించాలని తీర్మానించారు. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు మీడియాలో జరిగిన ప్రచారం ఆవాస్తవమని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.