సెప్టెంబర్ 12న బ్రేక్ దర్శనాలు రద్దు.. సిఫారసు లేఖలు స్వీకరించము
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను
By Medi Samrat Published on 8 Sep 2023 9:15 AM GMTతిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 12వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 12న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబరు 11న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించమని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించనున్నారు. దాతల సిఫార్సుపై ఇతరులకు గదుల కేటాయింపు ఉండదని టీటీడీ తేల్చి చెప్పింది. తిరుమలలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాతలు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా గదులను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.
సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 22న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని తెలిపారు. అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని తెలిపారు. ఒకే కాటేజిలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించనున్నారు.