6 నెలలపాటు స్వామివారి దర్శనం నిలుపుదల ప్రచారం అవాస్తవం

The campaign of stopping Swami's darshan for 6 months is unreal. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని

By Medi Samrat  Published on  30 Dec 2022 11:33 AM GMT
6 నెలలపాటు స్వామివారి దర్శనం నిలుపుదల ప్రచారం అవాస్తవం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదు. ఈ అంశానికి సంబంధించిన వాస్తవ వివరాలను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1న తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారు. ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యధావిధిగా దర్శించుకోవచ్చు. బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. గర్భాలయంలో మూలమూర్తికి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యధావిధిగా జరుగుతాయి. 1957-58వ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలో, 2018వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం.. భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించడం జరిగింది. వాస్తవం ఇలా ఉండగా, కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో 6 నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి చేసింది.


Next Story
Share it