జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జులై 17న తిరుపతికి వెళ్లనున్నారు. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నాయకుడు సాయిపై అమానుషంగా దాడి చేసిన సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పవన్ సోమవారం ఉదయం 9.30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10. 30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించనున్నారు. అలాగే జనసేన నాయకుడు సాయిని కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన నాయకుడు సాయిపై అమానుష దాడి ఘటనను జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర డీజీపీ దృష్టికీ తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు నాదెండ్ల మనోహర్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు, వాలంటీర్లు నిరసనలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా రోడ్ల మీదకు వచ్చారు. శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టిన జనసేన శ్రేణులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్థానిక జనసేన నేత సాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. చెంప దెబ్బ కొట్టారు. దీంతో పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.