జులై నెలలో తిరుమలకు ఎంత ఆదాయం వచ్చిందంటే?
తిరుమల శ్రీవెంకట్వేర స్వామికి జులై నెలలో రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు
By Medi Samrat Published on 2 Aug 2024 3:15 PM GMTతిరుమల శ్రీవెంకట్వేర స్వామికి జులై నెలలో రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. తిరుమలలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో 22.13 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. 1.04 కోట్లు లడ్డూలు అమ్ముడుపోయాయని తెలిపారు.
తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్‌ఈడీ టికెట్స్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డి టోకెన్‌లు, ఎస్‌ఇడి టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో, వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తోందన్నారు. టీటీడీ గత కొన్ని రోజులగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది. కానీ, ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నామన్నారు. నేటి నుండి తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్‌లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కూడా భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.