శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నట్లు
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. సామాన్య భక్తులు ఎవరైతే గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో, వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ చేయడం జరుగుతుందన్నారు.
ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే గదులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సిఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు తెలిపారు. తద్వారా వ్యక్తి లేకుండా లడ్డు టోకెన్ రాదన్నారు. అంతకుముందు మీడియా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల భక్తులు పొందుతున్న సౌకర్యాలను వివరించారు.