నవంబరు 10న ఆన్‌లైన్‌లో 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన
By Medi Samrat Published on 3 Nov 2023 9:11 AM GMTడిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300/- దర్శన టికెట్ల కోటాను నవంబరు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలియజేశారు.
తిరుపతిలో 9 కేంద్రాలలో 100 కౌంటర్లలో డిసెంబరు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేస్తామని తెలిపారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.
రోజుకు రెండు వేల శ్రీవాణి టికెట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.