కరోనా కట్టడికి కేంద్రం కొత్త వ్యూహం..!

By సుభాష్  Published on  13 April 2020 11:35 AM IST
కరోనా కట్టడికి కేంద్రం కొత్త వ్యూహం..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య పెరగకుండా ఉండేదేమో.. కానీ మర్కజ్‌ ఉదాంతం తర్వాత కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయి. దీంతో కరోనాను కట్టడి చేయలేని పరిస్థితి దాపురించింది.

ఈ కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్‌ 15 నుంచి మూడు జోన్లుగా విభజించే ఆలోచనలో మోదీ సర్కార్‌ ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై కూడా అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్‌ కేసుల ఆధారంగా జోన్లుగా విభజించనున్నారట. రెడ్‌ జోన్‌, ఆరేంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌లుగా గుర్తించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రెడ్‌ జోన్‌:

రెడ్‌ జోన్‌ అంటే.. కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా గుర్తించనున్నారు. ఈ జోన్‌ ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఎవ్వరిని బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటారు పోలీసులు. ఈ రెడ్‌జోన్‌ ప్రాంతాలు పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటాయి. నిత్యవసర వస్తువులను సైతం ఇంటివద్దకే పంపిస్తారు. ఎవరైనా బయటకు వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. అంతేకాదు ఈ జోన్‌ ప్రాంతంలో వైద్యులను సైతం ఏర్పాటు చేస్తారు. ఏదైనా అత్యవసరం ఉన్నా వైద్యులను ఇళ్లకే పంపిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.

ఆరేంజ్‌ జోన్‌:

కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరేంజ్‌ జోన్‌గా గుర్తిస్తారు. ఈ ఆరేంజ్‌ జోన్‌ ప్రాంతాల్లో పరిమితంగానే అనుమతి ఉంటుంది. రెడ్‌జోన్‌లో ఉన్న నిబంధనలు కాకుండా కొంత సడలింపు ఉంటుంది. లాక్‌డౌన్‌ పెద్దగా సడలించకపోయినా కొంత మేర వెసులుబాటు కల్పిస్తారు.

గ్రీన్‌ జోన్‌

ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాని ప్రాంతాలను గ్రీన్‌ జోన్‌లుగా గుర్తిస్తారు. ఈ జోన్‌ పరిధిలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇస్తారు. లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఇస్తారు. దేశంలో దాదాపు 430 జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఇలా మూడు జోన్లుగా విభజించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ జోన్లపై కేంద్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి మోదీ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే లాక్ డౌన్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story