కడప జిల్లాలో విషాదం.. శానిటైజర్ తాగి ముగ్గురు మృతి
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2020 12:43 PM ISTప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 16మంది మృతి చెందిన ఘటన మరువకముందే మరో జిల్లాలో ఇదే తరహా విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లాలోనూ మత్తు కోసం మందుబాబులు శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి చెందారు.
కొందరు నిన్న శానిటైజర్ తాగగా, అందులో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరికొందర్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. సోమవారం ఉదయం మరో వ్యక్తి చనిపోయాడు. మృతులను ఓబులేశు, భీమయ్య, చెన్నకేశవులుగా గుర్తించారు. మత్తుకు బానిసైన కొందరు వ్యక్తులు మద్యం ధరలు భరించలేక, లాక్‌డౌన్ ఇతర నిబంధనలతో మద్యం అందుబాటులో లేకపోవడంతో పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తున్నారు.
జిల్లాలోని పెండ్లిమర్రిలో గత వారం రోజుల నుంచి కొందరు శానిటైజర్లు తాగుతున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే బంధువులు శానిటైజర్ వ్యవహారం బయటకు రాకుండా రహస్యంగా ఉంచినట్టు చెబుతున్నారు. చెన్నకేశవులు మృతి చెందిన విషయం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా బంధువులు ఖననం చేసినట్టు చెబుతున్నారు. అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు తప్ప.. శానిటైజర్ విషయాన్ని బయటపెట్టలేదు. ఐతే ఆ నోటా ఈ నోటా పడి విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.