ఆయన అదృష్టం `13'.. తుదిశ్వాస విడిచింది `31'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 6:36 AM GMT
ఆయన అదృష్టం `13.. తుదిశ్వాస విడిచింది `31

ఎవరు ఏమైనా చెప్పనివ్వండి.. రాజకీయాల్లో ఏమున్నా లేకున్నా అదృష్టం మాత్రం తప్పనిసరి. అదే లేకుంటే.. అవకాశాలు చేతి వరకు రావొచ్చేమో కానీ.. చేజారిపోవటం ఖాయం. ఎంతోమంది కాంగ్రెస్ నేతలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి కానీ.. బీఫారాలు మాత్రం వేరే వారి చేతుల్లోకి వెళ్లటం తెలిసిన విషయమే. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఒక నానుడి తరచూ పలువురు సీనియర్ల నోటి నుంచి వస్తుంటుంది. అదేమంటే.. టికెట్ రాగానే చంకలు గుద్దుకోకు.. బీఫారం చేతికి తీసుకునే లోపు ఏమైనా జరగొచ్చని.

దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ దా జీవితం మాత్రం కాస్త భిన్నమైనది. ఆయనకు అదృష్టం టన్నుల కొద్దీ ఉంది. అందుకేనేమో.. ప్రమాణ స్వీకారం చూడటానికి రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆయన.. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కేంద్రమంత్రిగా వచ్చారు. అదెలా అంటారా? అక్కడికే వస్తున్నాం. 1973లో కొత్తగా ఎంపికైన మంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ప్రమాణం చేసే సమయంలో.. ఎంపిక చేసిన వారి సంఖ్య అశుభమని భావించారు. అప్పటికి అప్పుడు మరొకరి చేత ప్రమాణం చేయించటం ద్వారా లెక్క సరిచేయాలనుకున్నారు. అలా అనుకున్నంతనే వారికి కనిపించిన నేత ప్రణబ్ దానే. అలా ఇందిరమ్మ మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించారు. అలా మంత్రి అయిన ఆయన రాజీవ్ టైంలో ఇబ్బంది పడ్డారు కానీ.. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన లెక్క తప్పకపోవటం గమనార్హం.

1978లో సీడబ్ల్యూసీకి ఎన్నికైన ఆయన 1980లో పార్టీలో నెంబరు 2 స్థానానికి ఎదిగారు. ఇందిరమ్మకు కీలక సలహాదారుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే.. ప్రణబ్ దాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశాన్ని చెప్పాలి. అందరికి దురదృష్టం..కానీ ప్రణబ్ దాకు మాత్రం అదృష్టంగా చెప్పాలి. ప్రపంచంలో ఎవరిని అడిగినా 13 అంకెను అస్సలు ఇష్టపడకపోవటమే కాదు.. దాన్ని పలకటానికి కూడా ఇష్టపడరు. అంతేనా.. చాలా బహుళ అంతస్తుల్లో 13 అంకె అస్సలు కనిపించదు.

అంతటి దురదృష్ట సంఖ్య.. ప్రణబ్ దాకు మాత్రం లక్కీ నెంబరుగా చెబుతారు. పదమూడుతో ఆయనకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్లే.. ఆయన జీవితంలోని పలు కీలక ఘటనలు పదమూడుతోనే ముడిపడి ఉండటం విశేషం. ఆయన తొలిసారి లోక్ సభకు ఎన్నికైంది 2004 మే 13న. ఆయన పెళ్లి సైతం జులై 13నే. అంతేనా.. ఢిల్లీలోని ఆయన ఇంటి అడ్రస్ సైతం తల్కతొరా రోడ్డులోని నెంబరు 13 ఇంట్లోనే ఉండేవారు. అంతేనా.. పార్లమెంటులో ఆయన రూమ్ నెంబరు కూడా 13. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఫైనల్ గా భారత దేశ రాష్ట్రపతిగా వ్యవహరించిన ప్రణబ్ దా.. దేశ పదమూడో రాష్ట్రపతి కావటం ఆయనకు మాత్రమే చెల్లు. తుదిశ్వాస విడిచే దురదృష్టం ‘‘13’’ను తిప్పితే వచ్చే ‘‘31’’ కావటం గమనార్హం.

Next Story