చైనాకు ఝులక్.. శనివారం రాత్రి అసలేం జరిగింది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Sep 2020 6:33 AM GMT
చైనాకు ఝులక్.. శనివారం రాత్రి అసలేం జరిగింది?

భారత - చైనా సరిహద్దు ప్రాంతం మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఎత్తులు.. పైఎత్తులతో వాతావరణం వేడెక్కిపోతోంది. గతానికి భిన్నంగా భారత సైన్యం దూకుడు డ్రాగన్ జీర్ణించుకోలేకపోతోంది. మన సైనికులు చూపిస్తున్న ధైర్యసాహసాలకు చైనా బిత్తరపోతున్నట్లుగా తెలుస్తోంది. పదే పదే దొంగదెబ్బ తీస్తున్న చైనాకు భారత సైనికులు ఇస్తున్న వరుస షాకులు.. ఆ దేశానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని తీసుకొస్తోంది.

శనివారం రాత్రి చైనాకు చెందిన ప్రాంతాన్ని భారత్ ఆక్రమించినట్లుగా ఆ దేశం పేర్కొంది. అయితే.. అలాంటిదేమీ జరగకున్నా.. మన ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ఎత్తు వేసిన చైనాకు భారత సైనికులు సకాలంలో స్పందించి షాకిచ్చారు. తాజాగా అందుతున్న వివరాల్ని చూస్తే.. భారత్ - చైనా వాస్తవాధీన రేఖకు ఇరువైపులా లక్ష మంది సైనికులు మొహరించినట్లుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి వాస్తవాధీన రేఖ వద్ద ఏం జరిగిందన్న విషయానికి వస్తే..

గల్వాన్ లోయలో భారత్ ను దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసిన చైనా వ్యవహారం తెలిసిందే. దీనికి ధీటుగా తాజాగా భారత సైన్యం బదులిచ్చింది. పాంగాంగ్ ఉత్తర రేవును డ్రాగన్ దేశం అక్రమించినందుకు ప్రతీకారంగా దక్షిణ రేవును భారత్ తన వశం చేసుకోవటం కీలక పరిణామంగా చెప్పాలి. అర్థరాత్రి వేళ భారత్ ను దెబ్బ తీసేందుకు వేసిన చైనా ప్లాన్ ను భారత సైన్యం సమర్థంగా అడ్డుకోవటమే కాదు.. ఆ దేశానికి షాకిచ్చేలా.. కీలక పర్వత ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవటం గమనార్హం.

శనివారం రాత్రి చుషుల్ సెక్టార్ కు ఎదురుగా ఉన్న ప్రాంతం నుంచి భారీగా చైనా ట్యాంకులు.. వ్యాన్ లు ముందుకు కదలటం షురూ చేశాయి. ఈ టీంలో 200 నుంచి 500 మంది వరకు సైనికులు ఉన్నట్లుగా అంచనా. అక్కడి కీలకమైన బ్లాక్ టాప్ ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్నదే చైనా ప్లాన్. అదే జరిగితే.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారత శిబిరాలు.. కీలక పర్వత ప్రాంతాల్లోని భారత కార్యకలాపాల్ని తేలిగ్గా గుర్తించే వీలుంది.

భారత్ కు ఎంతో కీలకమైన ఈ ప్రాంతాన్ని తానే ముందుగా స్వాధీనం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్ ఫ్రాంటియార్ ఫోర్సును రంగంలోకి దించింది. ఆ వెంటనే పర్వత శిఖరాల్ని స్వాధీనం చేసుకుంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని పర్వతంలో ఎక్కడ నుంచి కెమేరాలు.. నిఘా పరికరాలు ఉన్న వాటిని భారత్ తక్షణం తొలగించింది. భారత్ చర్య మింగుడుపడని చైనా.. యుద్ధ ట్యాంకుల్ని రంగంలోకి దించింది.

దీనికి ధీటుగా భారత సైతం టి72, టి90 ట్యాంకుల్ని పర్వత ప్రాంతంలో మొహరించింది. అంతే కాదు.. ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణుల్ని రంగంలోకి దించటంతో డ్రాగన్ సైనికులు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఈ ప్రాంతంలోని 1962 యుద్ధ వేళలో పాంగాంగ్ దక్షిణ రేవు ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర ఘర్షణ జరిగినట్లు చెబుతారు.

శనివారం నాటి ఆపరేషన్లో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా చెబుతున్నారు. కొంత ప్రాణ నష్టం జరిగినట్లు చెబుతున్నా.. దానికి సంబంధించి వివరాలు బయటకు రాలేదు. పాంగాంగ్ దక్షిణ రేవులో మొహరింపు మొత్తం ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యగా భారత్ స్పష్టం చేసింది. ఎదురుదాడి తమ ఉద్దేశం కాదని చెప్పింది. భారత బలగాలు తమ అధీనంలోకి తీసుకున్న పర్వత ప్రాంతాన్ని చైనా తనదిగా చెబుతోంది.

రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్ని భారత్ ఉల్లంఘించిందని.. ఉద్రిక్తతలకు తావిచ్చినట్లుగా ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. తక్షణం ఆ ప్రాంతం నుంచి భారత్ వైదొలగాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇరు దేశాల మధ్య బ్రిగేడియర్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటల వేళలో మొదలైన చర్యలు దాదాపు ఆరు గంటల పాటు సాగినా.. ఎలాంటి ఫలితం రాకపోవటం గమనార్హం.

Next Story