కేసీఆర్ ఓకే.. ఇక తేల్చాల్సింది జగనే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 May 2020 9:08 PM ISTరెండున్నర నెలలుగా తెలుగు రాష్ట్రాల మధ్య సాధారణ రాకపోకలు ఆగిపోయి ఉన్నాయి. పాస్‌లు తీసుకుని, క్వారంటైన్ షరతులకు ఒప్పుకుని, మరికొన్ని ఇబ్బందుల్ని తట్టుకుని కొందరు అటు ఇటు రాకపోకలు సాగించారు కానీ.. చాలామంది ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. అంతర్ రాష్ట్ర రవాణాకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడం.. ఆయా రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించడంతో జనాలకు అవకాశం లేకపోయింది. ఐతే ఐదో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులిచ్చింది. ఐతే రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకారం తెలపాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి ప్రయాణాలు సాగించవచ్చని ప్రకటించింది.
ఇలా వెళ్లే, వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించలేదు. పాస్‌లు అక్కర్లేదు. క్వారంటైన్ షరతులు కూడా లేవు. ఐతే ఏపీ నుంచి తెలంగాణ వచ్చే వారికి ఇబ్బందేమీ లేదు కానీ.. తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే వారికే ఇప్పుడు సమస్య. ఏపీ ప్రభుత్వం కూడా అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులిస్తేనే ఇటు నుంచి అటు వెళ్లే వాళ్లకు ఇబ్బంది ఉండదు. ఆ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపితేనే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులూ రోడ్డెక్కుతాయి. ఇరు వైపులా రాకపోకలు సాగుతాయి. తెలుగు రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో రైళ్లు తిరగాలన్నా జగన్ సర్కారు అనుమతులివ్వాలి. ప్రస్తుతం రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక సర్వీసులు మాత్రమే నడుపుతోంది. ఏపీ ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు ఇస్తుందని ఆశిస్తున్నారు.