దాతలెందరున్నా.. వీరు మాత్రం చాలా ప్రత్యేకం..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 12:56 PM GMT
దాతలెందరున్నా.. వీరు మాత్రం చాలా ప్రత్యేకం..

కరోనా పై పోరాడేందుకు ప్రపంచంలో అపర కుబేరులు తమకున్న దానిలో బిలియన్, మిలియన్ డాలర్ల విరాళాలను ప్రకటించారు. బిల్ గేట్స్, అజీమ్ ప్రేమ్ జీ, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, వివిధ కంపెనీల వ్యవస్థాపకులు, వర్కర్లు, పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు ఇలా చాలా మంది తాము సంపాదించి కూడబెట్టిన దానిలోంచి విరాళాలిచ్చారు. వీరంతా గ్రేట్ అయ్యుండొచ్చు. కానీ.. వారికన్నా గొప్ప ఎవరో తెలుసా ? ప్రతినెలా తమకొచ్చేదానిలోంచి దానం చేసేవారు.

R1

కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా తుని వద్ద కాపలాగా ఉన్న పోలీసులకు ఓ మహిళ పోలీసుల కోసం కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసిచ్చింది. ఆ తల్లి దాతృత్వానికి చలించిపోయిన పోలీసులు.. తిరిగి ఆమెకే వాటిని ఇచ్చేసి ఇంట్లో పిల్లలకివ్వమ్మా అంటూ పంపించేశారు. ఆమె నెల జీతం రూ.2500. ఈ విషయం డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికెళ్లడంతో ఆయన వీడియోకాల్ లో మహిళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మీలాంటి వారిని చూస్తుంటే.. ఇంకా స్ఫూర్తి కలుగుతుందని ప్రశంసించారు కూడా.

R2

ఆ తర్వాత హైదరాబాద్ లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తన నెల జీతం రూ. 12000లో రూ.10,000 సీఎం సహాయనిధికి ఇచ్చింది. స్వయంగా మంత్రి కేటీఆర్ కు ఆమె చెక్కును అందించింది. పారిశుద్ధ్య కార్మికురాలి సహృదయాన్ని చూసిన కేటీఆర్ ఆమె దాతృత్వానికి ఫిదా అయ్యారు.

R3

జగిత్యాల జిల్లా, కోరుట్లలో ఉండే బుచ్చవ్వ కూడా పేదోళ్లకు సహాయం చేయాలని కంకణం కట్టుకుంది. తన ఆలోచనను భర్తకు చెప్పగా.. అతను కూడా సరేనన్నాడు. నాలుగేళ్లుగా కులవృత్తి (చాకలి) చేసుకుంటూ దాచుకున్న రూ. 25 వేల నగదును మూడు పూటలా తినేందుకు ఆస్కారం లేని పేద కుటుంబాలకు పంచాలని నిర్ణయించారు. ఆ రూ. 25 వేలను 16 కుటుంబాలకు.. కుటుంబానికి రూ.1500 చొప్పున అందజేశారు.

R4

ఇప్పుడు కమలమ్మ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. సమీపంలోని ఓ పల్లెటూరిలో ఉంటుంది కమలమ్మ. ఆమెకు నెలకు వచ్చే పెన్షన్ రూ.600. ఒకరోజు తమ ప్రాంతంలో మైసూరు రోటరీ క్లబ్ వారు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. వారి వద్దకొచ్చిన కమలమ్మ.. కొద్దిరోజులుగా మీరు మా ప్రాంతంలో ఆహారం అందిస్తున్నారు. నేను కూడా నా తరపున విరాళమిస్తున్నాను. ఈ రూ.500 తీసుకోండి. ఈ డబ్బు నాకు నెలకు వచ్చే రూ.600 పెన్షన్ లోవే. అదివిన్న వారు మొదట తీసుకోవాలా వద్దా అని సంకోచించినా.. ఆమె ఇచ్చే నగదు తీసుకుంటేనే ఆమె దాతృత్వానికి విలువిచ్చినట్లవుతుందని తీసుకున్నారు. ఆ తర్వాత రెండుచేతులూ జోడించి నమస్కారం చేశారు.

ఇది తల్లుల హృదయాలంటే. ఏమీలేనితనం నుంచి మన పక్కనవాళ్లు కూడా బాగుండాలన్నదే ఈ మాతృమూర్తుల తాపత్రయం. లాక్ డౌన్ లో ఎందరో అన్నదానాలు, నిత్యావసరాలు, ఇతర దానాలు చేసుండొచ్చు కానీ.. అలాంటి వారందరిలోనూ ఇలాంటివారు ప్రత్యేకం. ఒక లోకమణి, ఒక పారిశుద్ధ్య కార్మికురాలు, ఒక బుచ్చవ్వ, ఇప్పుడు కమలమ్మ. ఇలా ఎదుటివారి కడుపులు నింపేందుకు శ్రమిస్తున్న అమ్మలందరికీ ధన్యవాదాలు.

Next Story