థ‌ర్డ్ వేవ్ రాక‌ముందే అంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వండి.. ఎన్నిక‌లు జ‌రిపినంత వేగంగా..

YS Sharmila On Vaccination. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేష‌న్ విష‌య‌మై నిన్న‌ జాతినుద్దేశించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  8 Jun 2021 12:59 PM IST
థ‌ర్డ్ వేవ్ రాక‌ముందే అంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వండి.. ఎన్నిక‌లు జ‌రిపినంత వేగంగా..

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేష‌న్ విష‌య‌మై నిన్న‌ జాతినుద్దేశించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టీకా కోసం రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు పెట్టక్కరలేదని.. జూన్ 21 నుంచి 18 ఏళ్ళు నిండినవారికి కేంద్ర‌మే ఉచితంగా టీకా ఇవ్వ‌నుంద‌ని మోదీ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌న‌పై హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఈ నేఫ‌థ్యంలో వ్యాక్సినేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై వైఎస్ ష‌ర్మిల స్పందించారు. దీనిపై ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ష‌ర్మిల ట్వీట్ చేశారు.

ఇప్పటికైనా మోదీ గారు అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామనడం సంతోషం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు బట్టకాల్చి మీదేసుకొనే ప్రయత్నాలు మానేసి 3వ వేవ్ రాకముందే.. అందరికి వ్యాక్సిన్ ను త్వరితగతిన, ఎలక్షన్ లు ఎంత వేగవంతంగా జరిపించారో అంతే వేగంగా వ్యాక్సిన్ అందించాలని కోరుతున్నామ‌ని ష‌ర్మిల ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే.. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ( వైఎస్సార్ టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ వైఎస్సార్ టీపీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక కొత్త పార్టీకి సంబంధించి ఆడ్ హాక్ అధికార ప్రతినిధులను నియమించినట్లు వైఎస్ షర్మిల కార్యాలయం ప్రకటించింది. వీరిలో కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, మతిన్ ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్ లు ఉన్నారు.





Next Story