బీజేపీ ప్రోగ్రామ్‌లా పసుపు బోర్డు ఓపెనింగ్.. ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు బోర్డు స్టేట్‌మెంట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆమె, బోర్డు కార్యాలయ ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

By Knakam Karthik  Published on  19 Jan 2025 10:47 AM IST
Telugu news, telangana, Mlc Kavitha, Mp Arvind, Bjp, Brs

బీజేపీ ప్రోగ్రామ్‌లా పసుపు బోర్డు ఓపెనింగ్.. ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు బోర్డు స్టేట్‌మెంట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆమె, బోర్డు కార్యాలయ ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటోకాల్‌ను విస్మరించారని అన్నారు. కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ఓపెనింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


2014లోనే తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోడీని రెండు సార్లు కలిశానని, పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నం చేశానని చెప్పారు. పసుపుకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. త్రిముఖ వ్యూహంతో అలుపెరుగని పోరాటం చేశానన్న ఎమ్మెల్సీ కవిత.. ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడటం అలవాటు అని విమర్శించారు. తాము పసుపు బోర్డు పోరాటం మొదలుపెట్టిన రోజుల్లో అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని సెటైర్ వేశారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చిన అర్వింద్.. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుటుందని అన్నారని గుర్తుచేశారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది.. పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని అర్వింద్ అన్నారని కవిత తెలిపారు. ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుంది. దానిని అర్వింద్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాలి.

కాగా నిజామాబాద్‌ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Next Story