యాదగిరిగుట్టలో మాడ వీధుల్లో పూజలు నిర్వహించడంపై ఆలయ ఈవో భాస్కర్ రావు ఆగ్రహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు మాడ వీధుల్లో ప్రైవేటు వ్యక్తులతో పూజలు చేయడంపై ఆలయ ఈవో అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారంటూ పిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని.. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ల చర్యలు ఉన్నాయంటూ ఈవో భాస్కర్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యాదగిరిగుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. దేవాలయానికి నియమ నిబంధనలు ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గింగిడి సునీతతో పాటు మరికొంతమంది దేవాలయానికి వచ్చి నియమ నిబంధనలను ఉల్లంఘించి పూజలు నిర్వహించారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.