కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఘన విజయం సాధించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటమిని చవి చూశారు. మొదటి పదమూడు రౌండ్లు రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 14వ రౌండు నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందుకు వచ్చారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై 4,273 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చివరి రౌండ్లలో రేవంత్ రెడ్డి మూడోస్థానానికి పడిపోయారు.
గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా గెలుపొందారు. బీజేపీ ఉత్తర తెలంగాణలో సత్తా చాటింది. ఆర్మూర్, నిర్మల్, ముథోల్, నిజామాబాద్ అర్బన్ తో పాటు హైదరాబాద్ లోని గోషామహల్ స్థానాన్ని కూడా గెలుచుకుంది. ఇప్పటివరకు ఐదు సీట్లలో గెలిచింది. మూడు స్థానాలలో ముందంజలో ఉంది.