ఓట్లకోసమే త్రిభాషా సిద్ధాంతంపై వితండవాదం, డీఎంకేపై కేంద్రమంత్రి విమర్శలు
బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని డీఎంకే విమర్శించడం వితండవాద చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 16 March 2025 3:20 PM IST
ఓట్లకోసమే త్రిభాషా సిద్ధాంతంపై వితండవాదం, డీఎంకేపై కేంద్రమంత్రి విమర్శలు
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని డీఎంకే విమర్శించడం వితండవాద చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నాయకుల సమావేశం రాజకీయ దురుద్దేశ చర్య. వచ్చే ఆరు నెలల్లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. డీఎంకే ఓడిపోతుంది. స్టాలిన్ కుటుంబం అవినీతి బయటపడుతుంది అని కొత్త నాటకం ఆడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మోడీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో తమిళనాడులో జరిగిన లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల ఆలోచనలు మలిచే విధంగా కుట్రలు చేస్తున్నారు..అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు డీఎంకే అడ్డుకోలేదు. త్రిభాషా విధానం బ్రిటీష్ కాలంలోనే మొదలైంది. సి.రాజుగోపాలచారి వల్ల త్రిభాషా సిద్ధాంతం వచ్చింది. కొఠారి కమిషన్ కూడా త్రి భాషా సిద్ధాంతాన్ని సమర్థించింది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించింది బీజేపీ ప్రభుత్వమే. 2020లో వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం రూపాయి లోగో వచ్చింది. దానిని ఇప్పుడుందుకు తీసి వేశారు. డీఎంకే, కాంగ్రెస్‌కు సవాల్ చేస్తున్నారు. 2010లో ఎందుకు రూపాయి లోగో లాంఛ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటి? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ తమిళనాడులో చెల్లుబాటు అవుతుందా కాదా? రాహుల్ గాంధీ, స్టాలిన్ చెప్పాలి. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
త్రిభాషా సిద్ధాంతం మొదటి నుంచే ఉంది. మోడీ కొత్తగా తెచ్చింది ఏమీ లేదు. ఓట్ల కోట్ల కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రతిసారి డీఎంకేకి కష్టం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ఓడినప్పుడు ఈ రకమైన చర్చ లేవనెత్తుతున్నారు. అంబేద్కర్, విద్యను రాష్ట్ర పరిధిలో ఉంచితే, ఇందిరాగాంధీ హయాంలో ఉమ్మడి పరిధిలోకి తీసుకువచ్చారు. త్రిభాషా సిద్ధాంతంపై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ దేశంలో హిందీ ఉండకూడదా అని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా? తమిళ్ అంటేనే సుబ్రహ్మణ్యం గుర్తుకు వస్తారు. ఆయన జయంతిని జాతీయ భాషా దినోత్సవంగా మోడీ ప్రకటించారు. తమిళ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతూ పార్లమెంట్‌లో సింగోలు ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.