బీఆర్ఎస్ కార్యకర్తలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిక్వెస్ట్
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే!! తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరోసారి సత్తా చాటాలని భావిస్తూ ఉంది.
By Medi Samrat Published on 9 Feb 2024 10:56 AM GMTపార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే!! తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరోసారి సత్తా చాటాలని భావిస్తూ ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలకు రిక్వెస్ట్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కిషన్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిందని.. మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళం వేశారని.. తెలంగాణలోనూ రేపు అదే పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించామన్నారు. ప్రాబబుల్స్ లిస్ట్ రెడీ అయిందని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. బీజేపీ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ సీట్లు కూడా ఉంటాయన్నారు. తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తామని.. మెజార్టీ సీట్లు గెలుస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు.
భారత రత్నను తెలుగు బిడ్డ పీవీ నర్సింహరావు అందుకోవడం నిజంగా గర్వంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. తెలుగు బిడ్డకు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు దక్కడం తెలుగు జాతికి గర్వకారణమన్నారు. దేశ ప్రగతికి పునాదులు వేసిన, ప్రపంచ మార్కెట్‌ను భారత్‌లోకి ప్రోత్సహించడం, విదేశీ విధానం, విద్యారంగంలో విప్లవకర సంస్కరణలు పీవీ నర్సింహరావు తెచ్చాడని.. ఆయన రాజనీతిజ్ఞుడే కాదు, ఆర్థిక వేత్త, సాహిత్యాకారుడు, రచయిత, ఇంకా ఎన్నో రంగాల్లో ఆయన సేవలు అందించాడని కొనియాడారు. పీవీ నర్సింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్నాడని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితికి ప్రతినిధిగా వాజ్‌పేయిని పంపించాడన్నారు. ఇంతటి గొప్ప ఆలోచనలు పీవీ సొంతం అని.. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పీవీ ఆదుకున్నాడని కిషన్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ మాత్రం ఆయనను గౌరవించలేదని, ఆయన కుటుంబ సభ్యులకూ గౌరవం ఇవ్వలేదని వివరించారు. పీవీ నర్సింహరావు తన జీవిత చరమాంకంలో ఎంతో క్షోభ అనుభవించాడని, కాంగ్రెస్ ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని బాధపడ్డాడని తెలిపారు.