తెలంగాణలోని పంచాయితీలకు త్వరలోనే నిధులు..గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి

తెలంగాణలో స్థానిక సంస్థలకు నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

By -  Knakam Karthik
Published on : 14 Jan 2026 6:27 PM IST

Telangana, Kishanreddy, Central Minister, Telangana Government, Grama Panchayiti, Congress, Brs, Bjp

తెలంగాణలోని పంచాయితీలకు త్వరలోనే నిధులు..గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి

తెలంగాణలో స్థానిక సంస్థలకు నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా.. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. రూ.11వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

2015-16 నుంచి 2019-20 మధ్యలో.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గ్రామపంచాయతీలకు రూ.5,060 కోట్లు విడుదల చేయగా.. 2020-21 నుంచి 2025-26 మధ్యలో.. ఈ కేటాయింపులు 80% (రూ.9,050 కోట్లు) పెరిగాయి. ఇందులో రూ.6,051 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా.. మారుమూల ప్రాంతాల వరకు కూడా జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని ఇందుకోసమే.. స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను మొదట్నుంచీ సమయానుగుణంగా విడుదల చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఇటీవల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మిగిలిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ఖర్చుపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇటీవలే సబ్‌మిట్ చేశారని, దీనికితోడు గ్రామపంచాయతీలకు ఎన్నికలు కూడా పూర్తయిన నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులైన రూ.260 కోట్లను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిపారు. వీటి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వగానే దశల వారిగా మిగిలిన రూ.2,500 కోట్ల నిధులు కూడా విడుదల కానున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story