ముస్లిం రిజర్వేషన్ల కోసమే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ధర్నా చేస్తుంది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే. బీసీలకు 5 శాతం పెంచి, ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోంది. బీసీ ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తాం. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం..అని బండి సంజయ్ సవాల్ చేశారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీని ప్రధాని చేశారా? ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా?. రాష్ట్ర కేబినెట్‌లో, నామినేటెడ్ పదవులను ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా? లోక్ సభ సభ్యుల్లో ఎంతమంది బీసీలకు సీట్లిచ్చారో సమాధానమివ్వగలరా? మీరా బీసీల గురించి మాకు నీతులు చెప్పేది? బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదే. 27 మంది బీసీ కేంద్ర మంత్రులను, అనేక రాష్ట్రాలకు బీసీ సీఎంలను నియమించిన ఘనత బీజేపీదే. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుండి కాంగ్రెస్ తప్పుకోవాలనుకుంటుంది. యూపీ, బెంగాల్, బీహార్ తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగవడం తథ్యం..అని బండి సంజయ్ విమర్శించారు.