కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అనడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. కిషన్ రెడ్డి మెడికల్ కాలేజీల విషయంలో అబద్దాలు మాట్లాడారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ కాలేజీకి స్థలం ఇవ్వలేదని అన్నారని.. తమ ప్రభుత్వం ఏకంగా బిల్డింగ్‌ను కేటాయించిందని హరీష్ రావు చెప్పారు. బీబీ నగర్ నిమ్స్‌ను ఎయిమ్స్ ఆస్పత్రికి కేటాయించామని, బిల్డింగ్‌తో పాటు 201 ఎకరాల 24 గుంటల భూమిని ఇచ్చామని అన్నారు.
మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ విషయంలో కిషన్ రెడ్డి తప్పుగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. పట్టింపు ఉంటే మెడికల్ కాలేజీలకు నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యాక బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని, రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 21 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందన్నారు.
విభజన చట్టంలో తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వాలని ఉందని.. దాని తుంగలో తొక్కారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని అన్నారు. గిరిజన యూనివర్సిటీ, నవోదయ విద్యాలయాలను తెలంగాణకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీల జనగణన చేయించాలని కిషన్ రెడ్డి కోరుతున్నామని హరీష్ అన్నారు. రు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతల ప్రవర్తను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి హరీష్ పేర్కొన్నారు. వరి ధాన్యం కొనవద్దని చెప్పింది బీజేపీనే.. వరి ధాన్యం కొనాలి అని మాట్లాడుతున్నది బీజేపీ పార్టీనే అని.. ప్రజలు చూస్తున్నారని మంత్రి అన్నారు.