టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాలు పూర్తయ్యాయ‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాలలో భాగంగా గ్రామ కమిటీలు, వార్డు, కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీల నిర్మాణం సంపూర్ణంగా ముగిసిందని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పార్టీ చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికను చేపట్టేందుకు అక్టోబర్ 25వ తేదిన‌ హైదరాబాదులోని హెచ్ఐసీసీలో పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

గతంలో సాధారణ ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో పార్టీ ప్రతినిధుల సభ, ప్లీనరీ జరగలేద‌ని.. పార్టీ అధ్యక్షుణ్ని ఎన్నుకునేందుకు 14 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతారని తెలిపారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న‌ట్లు వివ‌రించారు. 17 నుంచి 22 వ తేదీ వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరణ ఉంటుంది. 23న నామినేషన్ల స్క్రూటినీ, పరిశీలన.. 24న‌ నామినేషన్ల ఉపసంహరణ, 25న‌ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంద‌ని తెలిపారు.

పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని పార్టీ సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ పర్యవేక్షిస్తారని వెల్ల‌డించారు. 25న జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తైన‌ తర్వాత ప్లీనరీలో వివిధ అంశాలపైన పార్టీకి అధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాల కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వ్య‌వ‌హ‌రిస్తార‌ని అన్నారు.

అక్టోబర్ 17వ తేదీన పార్టీ ఉమ్మడి శాసనసభపక్ష సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తార‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించి.. అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహిస్తామ‌ని తెలిపారు. తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు అవుతారని తెలిపారు

పార్టీ గ్రామ, వార్డ్, మండల ,పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27 నాడు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు నిర్వహించనున్నామ‌ని కేటీఆర్ అన్నారు.


సామ్రాట్

Next Story