మోదీ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన నిర‌స‌న‌లు

TRS activists conduct mock funeral procession of PM Modi in Armoor. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర‌వ్యాప్తంగా బుధవారం

By Medi Samrat  Published on  9 Feb 2022 3:30 PM GMT
మోదీ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన నిర‌స‌న‌లు

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర‌వ్యాప్తంగా బుధవారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు దిష్టి బొమ్మ‌లు ద‌గ్ధం, శవయాత్రలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. కార్య‌క్ర‌మంలో మోదీ దిష్టి బొమ్మ ద‌హ‌నం చేశారు. అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు మంగళవారం పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. నిరసన పిలుపు మేరకు టీఆర్‌ఎస్ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించి నిరసనలు చేపట్టారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాసరావు కూడా నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. మోతీనగర్‌, రాజీవ్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లిలో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.

జనగాం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ దగ్గర టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు నిరసనకు దిగారు. నిరసన సందర్భంగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా.. బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ప్రధాని వ్య‌తిరేకంగా నిరసన తెల‌ప‌గానికి టీఆర్‌ఎస్ నేతల రాకతో పరిస్థితి మరింత తీవ్రమైంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.


Next Story