ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.
By Knakam Karthik
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
హైదరాబాద్ గాంధీభవన్‌లో ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగనుంది. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా నూతనంగా నియామకమైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికారు ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. టీపీసీసీ కార్యవర్గ ప్రకటన తాత్కాలిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గా తమిళనాడుకు చెందిన సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నియమితులైన నేపథ్యంలో ఆమె రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాల సమాచారం. వాస్తవానికి పీసీసీ కార్యవర్గాన్ని ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. గత నెలలో కేసీ వేణుగోపాల్ హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో వీలున్నంత త్వరగా పీసీసీ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కూడా రెండుమూడు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అయితే, ఈ జాబితా ఖరారవుతున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ మార్చటంతో జాబితా ప్రకటనను వాయిదా వేశారని తెలుస్తోంది.