TSPSC Paper Leak Case : సిట్ విచారణ కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతోంది : రేవంత్
TPCC President Revanth Reddy's allegations against Minister KTR. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని
By Medi Samrat Published on 28 March 2023 9:28 AM GMTRevanth Reddy
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. విచారణను తప్పుదారి పట్టించి ప్రభుత్వంలో పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ మాటలు, తొందరపాటు చూస్తుంటే తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమవుతోందని రేవంత్ అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశాన్ని ప్రభుత్వం బయటపెట్టిందనడం అబద్ధం అని అన్నారు. నేరగాళ్లు పంపకాల్లో తేడాలతో.. వారికి వారే ఈ కుంభకోణాన్ని బయటపెట్టుకున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే టీఎస్పీఎస్సీ బేగంపేటలో పిర్యాదు చేసింది. ప్రభుత్వం ఈ కేసును పక్కదారి పట్టించేందుకె సిట్ కు అప్పగించింది. ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు కేసును సిట్ కు అప్పగించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు అప్పగించిన కేసులలో ఏ సిట్ కూడా నివేదిక ఇవ్వలేదు.. చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలోనే అవకతవకలకు పునాది వేసిందని ఆరోపించారు.
గ్రూప్-1 పరీక్ష కేంద్రంలో సమయం దాటిన తరువాత కూడా పరీక్షలు రాయించారని ఆరోపించారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అన్నారు. విచారణకు ముందే కేటీఆర్ ఆ కేసు ఇద్దరికి సంబంధించిందని ఎలా చెబుతారని తాము ప్రశ్నించామన్నారు. చర్చంతా కేటీఆర్ వైపు దారితీయడంతో... తన పీఏకు కూడా కేసుతో సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. పీఏ తిరుపతి చిన్న పావు మాత్రమే.. మేం నిర్దిష్టంగా కేటీఆర్ పైనే ఆరోపణలు చేస్తున్నామన్నారు.
సిట్ విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వకముందే.. జగిత్యాలలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంది.. ఆయనకు నోటీసులు ఇవ్వాలని సిట్ ను కోరాము.. ఆయనకు నోటీసులు ఇవ్వకపోగా.. మాపై క్రిమినల్ కేసులు పెడతామని మీడియాకు లీకులు ఇచ్చారని అన్నారు. సిట్ మాకు నోటీసులు ఇస్తోంది.. కేటీఆర్ కు విచారణ చేసిన రహస్య సమాచారం అందిస్తోందని ఆరోపించారు. సిట్ విచారణ కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతోందని అన్నారు. జరిగిన లావాదేవీలను కేటీఆర్ కప్పిపుచే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రయత్నంలో భాగమే నిన్న సిరిసిల్లలో నేరాన్ని చిన్నది చేసి చూపే ప్రయత్నం చేశారని అన్నారు.
కోర్టుకు అందించాల్సిన సమాచారం కేటీఆర్ కు ఎలా చేరుతోందని సందేహం వ్యక్తం చేశారు. నేరగాళ్లు ఇచ్చారా?.. విచారణ అధికారి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ సమాచారం ఎవరిచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాకు నోటీసులు ఇచ్చిన ఏఆర్ శ్రీనివాస్.. కేటీఆర్ కు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. దీని వెనక గూడుపుఠానీ ఏమిటి? అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ అధికారులు మాకు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈడీ, సీబీఐ అధికారులు కాంగ్రెస్ పార్టీకి అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.
ఈ కేసును సీబీఐ మాత్రమే విచారణ చేయగలుగుతుందని రేవంత్ అన్నారు. ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. సీబీఐ, ఈడీ, ఏసీబీ అన్ని డిపార్ట్ మెంట్స్ కలిపి సిట్ వేయాలని.. మంత్రి కేటీఆర్ ను కూడా ఈ కేసులో విచారణ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.