గద్దర్ కలలు కన్న తెలంగాణకై పోరాడదాం : రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy On Gaddar Death. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు గద్దర్ తెలంగాణ జనసభతో

By Medi Samrat  Published on  6 Aug 2023 4:49 PM GMT
గద్దర్ కలలు కన్న తెలంగాణకై పోరాడదాం : రేవంత్ రెడ్డి

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు గద్దర్ తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఆయ‌న మాట్లాడుతూ.. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని అన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని పేర్కొన్నారు. పీడిత, తాడిత ప్రజల పక్షాన గళమై వినిపించారని అన్నారు. భూమి, ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంటుందన్నారు.

గద్దర్ అన్నతో నాకు వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. నాలాంటి వారికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవి, కళాకారుడు ఆయన అని కొనియాడారు. తుది దశ తెలంగాణ ఉద్యమం కోసం చివరి శ్వాస వరకు పరితపించారని పేర్కొన్నారు. దొరల నుంచి తెలంగాణను కాపాడాలని తుది దశ ఉద్యమానికి అండగా నిలబడ్డారని వెల్ల‌డించారు. రాహుల్ కు గద్దర్ అన్నపెట్టిన ముద్దు తడి ఇంకా ఆరలేదని అన్నారు.

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు. గద్దరన్న అంతిమ యాత్ర రేపు 11 గంటలకు మొదలవుతుందని తెలిపారు. ఎల్బీ స్టేడియం నుండి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు సాగుతుందని వెల్ల‌డించారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో నివాళులు అర్పిస్తామ‌ని తెలిపారు. అమరవీరుల స్థూపం నుండి భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి పార్థీవదేహం చేరుకుంటుంద‌ని వెల్ల‌డించారు.

భూదేవినగర్ లోని మహాభారతి విద్యాలయం అవరణలో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు. అంత్యక్రియలకు వేలాదిగా తరలివచ్చి గద్దర్ కు నివాళులు అర్పించండి. తుది దశ ఉద్యమానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నింపుకుని ఆయన కలలు కన్న తెలంగాణకై పోరాడదామ‌ని పిలుపునిచ్చారు.

Next Story