పంతాలు, పట్టింపులతో కేసీఆర్, మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు

TPCC President Revanth Reddy Fire On KCR and Modi. భూమి, వ్యవసాయం, రైతుల సమస్యలపై సీఎస్ కు వినతిపత్రం అందజేశామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  21 Nov 2022 2:38 PM IST
పంతాలు, పట్టింపులతో కేసీఆర్, మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు

భూమి, వ్యవసాయం, రైతుల సమస్యలపై సీఎస్ కు వినతిపత్రం అందజేశామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల కష్టాలు, సమస్యలను సీఎస్ కు వివరించామ‌న్నారు. కూర్చోవడానికి సచివాలయం లేదు, కలవడానికి సీఎం లేర‌ని.. వివిధ సామాజిక వర్గాల సమస్యలపై కొట్లాడుతున్న సంఘాలకు ఎనిమిదేళ్లుగా సీఎం దర్శనం కలగలేదని విమ‌ర్శించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండాలి.. సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు.. సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేస్తుంద‌ని ఆరోపించారు.

వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి.. కానీ ప్రయివేటు వ్యక్తుల, కంపెనీల చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతున్నాయ‌ని.. వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ కు వివరించిన‌ట్లు తెలిపారు. భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 24 లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదు.. తక్షణమే భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని.. ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని.. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే.. ఈ నెల 24న మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతామ‌ని అన్నారు. ఈ నెల 30న ధరణి బాధితులతో నియోజకవర్గాల్లో నిరసన చేపడతామ‌ని.. డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామ‌ని తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ వివాదాలు సృష్టిస్తున్నాయని విమ‌ర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. దాడులు, ప్రతిదాడులతో గందరగోళం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పెట్టుబడులను గుజరాత్ కు తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని.. ఇది తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుందని అన్నారు. పంతాలు, పట్టింపులతో కేసీఆర్, మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమ‌ర్శించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారని మండిప‌డ్డారు.


Next Story