బీజేపీపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy Fire On BJP. మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on  14 Oct 2022 12:39 PM GMT
బీజేపీపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి రోజైన శుక్ర‌వారం నాడు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌లంతా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మామ ఆణిముత్యం.. నేను స్వాతిముత్యం అని మంత్రి హరీష్ రావు చెబుతాడని విమర్శించారు. తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన కొడంగల్ లో కూడా దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కానీ కొడంగల్ రోడ్లపై తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆయన విమర్శించారు. కేటీఆర్ పోగానే కేసీఆర్, హరీష్ రావులు వచ్చి ప్రజలకు హామీలిస్తారన్నారు. కేటీఆర్ ఇచ్చిన హామీల కంటే గొప్పగా కేసీఆర్ హామీలిస్తారన్నారు.

మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని అంటున్నాడని.. ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు ఏమైనా చేశాడా అని నిలదీశారు. 2009లో ఎంపీ, 2014 ఎమ్మెల్సీ, 2018లో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారన్నారు.ఇప్పుడు బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు నుండి మళ్లీ తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారన్నారు. ఎంపీగా,ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పిస్తే కన్నతల్లి లాంటి పార్టీని వీడి కత్తి పట్టుకుని ఆ పార్టీని నాశనం చేసేందుకు రాజగోపాల్ రెడ్డి తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని వీడలేదని అన్నారు. బీజేపీ బఫూన్ పార్టీ అని.. ఒక ఆడబిడ్డను ఓడించాడానికి ఇంత చేయాలా అని ప్రశ్నించారు.


Next Story