ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది : టీపీసీసీ చీఫ్‌

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.

By -  Medi Samrat
Published on : 8 Nov 2025 3:25 PM IST

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది : టీపీసీసీ చీఫ్‌

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న ఓటు చోరీలపై రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఇప్పటివరకు 5 కోట్ల మందికిపైగా ప్రజలు మద్దతు తెలిపారని తెలిపారు. లోక్‌సభతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన అవకతవకలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపిస్తోందని ఆయన అన్నారు.

కర్ణాటకలోని మహదేవ్‌పుర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో జరిగిన భారీ తప్పిదాలు, బీజేపీ మోసాలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ చేసిన కుట్రలను రాహుల్ గాంధీ స్పష్టమైన రుజువులతో నిరూపించారని తెలిపారు.

హర్యానాలో 25 లక్షలకుపైగా నకిలీ ఓటర్లు, 5 లక్షల డూప్లికేట్ ఓటర్లు, వందలాది తప్పుడు చిరునామాలు, వేలాది తప్పు ఫోటో వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకే మహిళ ఫోటోతో 22 ఎంట్రీలు, 100 ఓటరు కార్డులు ఉన్నట్టుగా రాహుల్ గాంధీ నిర్ధారణ చేశారని చెప్పారు.

బీహార్‌లో కూడా బీజేపీ సహకారంతో “సర్” పేరుతో సంబంధం లేని ఓట్లను తొలగించిందని విమర్శించారు. ఓటు చోరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం బీజేపీ చెప్పుచేతుల్లో ఉందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాహుల్ గాంధీ బీహార్‌లో ప్రారంభించిన ‘ఓటు అధికార్ ర్యాలీ’ బీజేపీలో వణుకు పుట్టించిందని మహేష్ గౌడ్ అన్నారు. హర్యానా ఫార్ములాను అనుసరించి బీజేపీ ఇప్పుడు బీహార్‌లో గెలవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో పక్క జిల్లాల ఓటర్లను నమోదు చేసి, బీజేపీ సహకారంతో బీఆర్‌ఎస్ గెలిచిన ఉదాహరణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఓటు చోరీలను ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

“ఇందిరా గాంధీ ఏనాడు అవకతవకలకు పాల్పడలేదు. ఓటు హక్కు కాలరాసే హక్కు ఎవరికీ లేదు” అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.

Next Story