కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనహిత పాదయాత్రలో ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపించింది. పథకాలను ప్రస్తావిస్తూ అనేక చోట్ల ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. నెలకు నాలుగు ఐదు రోజులు జనహిత పాదయాత్ర విడతల వారీగా ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. పీసీ ఘోష్ రిపోర్టు పై కేబినెట్ భేటీలో చర్చిస్తారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడల వలన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుర్ఘతి పట్టింది. కాళేశ్వరం విషయంలో వాస్తవాలు బయటికి వచ్చాక దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం..అని మహేశ్ కుమార్ అన్నారు.
బీసీ ఉద్యమానికి ఎవరు మద్దతు ఇచ్చినా స్వాగతిస్తామని మహేశ్ కుమార్ తెలిపారు. బీసీ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటి? బీసీ బిల్లుకి మద్దతు ఇచ్చిన బీజేపీ ప్రజా ప్రతినిధులు ఎందుకు తోక ముడిచారు..అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, రామచంద్ర రావు బీసీ బిల్లుపై విషం కక్కుతుంటే బీజేపీ బీసీ ప్రజా ప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదు? మైనార్టీల పేరు చెప్పి బీసీ బిల్లును అడ్డుకోవాలని కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీసీల ఓట్లు లేకుండా కిషన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలడా?..అని మహేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.