బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింగ్వి తో సమావేశం అయిన అనంతరం మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి సుప్రీం కోర్టులో కేసు విచారణకు రావచ్చు.. 40 పేజీలతో పిటిషన్ వేశాం. ప్రభుత్వం ఇచ్చిన జీవోను యధాతంగా అమలు చేయాలనే ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఓబీసీల జీవితాలు బాగుపడాలని కాంగ్రెస్ చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయాలకు బిజెపి, బీఆర్ఎస్‌లు అడుగడుగునా వ్యతిరేకిస్తున్నాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది, బీసీ రిజర్వేషన్ల జీవోపై పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించినప్పటికీ , జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే విధిస్తూ, పాత విధానంలో ఎన్నికలకు వెళ్లాలని ఆదేశానికి ఇచ్చింది. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరం ..అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
హైకోర్టు ఇచ్చిన స్టే ను, ఆర్డర్ ను చాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాం. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి తో ప్రత్యేకంగా సమావేశం అయ్యాను. తెలంగాణ ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పి గురువారం లిస్ట్ అవుతుందని ఆశిస్తున్నాం . సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం . రాష్ట్ర అసెంబ్లీలో రెండు చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై మద్దతు పలికాయి . బీజేపీ, బీఆర్ఎస్‌లు ఇప్పుడు మాట మార్చి వ్యతిరేకిస్తున్నాయి..అని మహేశ్ కుమార్ ఆరోపించారు.